పరిచయం
1. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ డాకుమెంట్లు తరచుగా భారీగా ఉంటాయి, వీటిని సాధారణ ప్రజలు తేలికగా అర్ధం చేసుకోలేని రీతిలో సమర్పిస్తారు. ప్రజలకు తమ సంక్షేమం పై బడ్జెట్ ప్రభావం, మరియు ప్రభుత్వం డబ్బును ఎక్కడి నుండి సేకరిస్తుందో ఆ డబ్బును ఎక్కడ ఎలా ఖర్చు చేస్తుందో తెలుసుకోవడానికి కూడా ఆసక్తిని చూపిస్తారు. అంతేకాకుండా, ఒక రంగానికి కేటాయించిన నగదులో నిజానికి ఎంత ఖర్చయింది, ఆ రంగంలో ప్రభుత్వ వ్యయం పెరిగిందా లేదా తగ్గిందా అని తెలుసుకోవడంలో కూడా వారికి ఆసక్తి ఉంటుంది. దీనికితోడు, లోటు మరియు ఋణ స్థాయిల గురించి కూడా ఆందోళనలు ఉంటాయి.
2. భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకు కార్యాచరణ భాద్యతలు ఎక్కువగా కేటాయించారు. ఇవి పౌరుల జీవితాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి, రాష్ట్ర స్థాయిలో అమలు చేసే విధానాలు మరియు కార్యక్రమాలు భారతదేశంలోని పౌరులపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. భారతదేశంలో రాష్ట్రాలు 38 శాతం పన్నులను సేకరిస్తాయి, మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60 శాతం ఖర్చు చేస్తాయి. ఆరోగ్యం మరియు విద్య రంగాల మొత్తం ఖర్చును దాదాపు 70 శాతం రాష్ట్రాలే భరిస్తాయి. మౌళిక సదుపాయాలు కల్పించటంలో రాష్ట్రాలు కీలక పాత్రను పోషిస్తాయి. కాబట్టి ప్రతి పౌరుడు రాష్ట్ర బడ్జెట్ ను, కేంద్ర బడ్జెట్ తో ముడి పెట్టకుండా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
3. మనం రాష్ట్ర బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే మొదట వాటిలోని పదాలను మరియు వాటి నిర్వచనాల గురించి తెలుసుకోవాలి.
4. రాష్ట్ర బడ్జెట్ వార్షిక ప్రక్రియ. వార్షిక బడ్జెట్, ఏప్రిల్ నుండి మొదలై తదుపరి మార్చి నెలలో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో ఒక రాష్ట్ర వనరులు మరియు వ్యయాల నివేదిక. ఒక కంపెనీ బడ్జెట్ؚలాగా కాకుండా, రాష్ట్ర బడ్జెట్ అనేది మొత్తం జనాభా మీద విస్తృతమైన పరిధిని మరియు ప్రభావాలను కలిగి ఉంటుంది.
5. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రాలు చేపట్టే కార్యకలాపాల పరిధి విస్తృతంగా పెరిగింది మరియు నేడు ప్రభుత్వ కార్యకలాపాలు అనేక లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశింపబడ్డాయి, దీనిలో వృద్ధిని ప్రోత్సహించడం, ఆదాయాన్ని పంపిణీ చేయడంలో స్థానిక అసమానతలను నివారించడం,పేదరికాన్ని నిర్మూలించడం మరియు మానవ వనరుల అభివృద్ధి ఉన్నాయి. పెరుగుతున్న రాష్ట్రాల పాత్రను, భారత రాజ్యాంగంలో వాటికి కేటాయించిన ముఖ్యమైన అంశాల నేపధ్యంలో చూడాలి.
6. రాష్ట్రాలకు కేటాయించిన అంశాలలో, మిగిలిన వాటితో పాటు, శాంతి భద్రతల నిర్వహణ, న్యాయ వ్యవహారాల నిర్వహణ, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, ఆరోగ్యం మరియు సాంఘిక సంక్షేమం ఉంటాయి. తమ విధానాలను వివరించడానికి మరియు వాటిని అమలు చేయడానికి, బడ్జెట్ అనేది ప్రభుత్వానికి అతి ముఖ్యమైన సాధనం.
7. రాష్ట్ర బడ్జెట్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి క్రింద క్లుప్తంగా ఇవ్వబడ్డాయి.
- ప్రభుత్వ ఆర్ధిక స్థితిగతుల గురించి నివేదికగా పని చేస్తుంది.
- ప్రభుత్వ విధానాలకు సూచికగా ఉంటుంది.
- తమకు కలిగే ప్రయోజనాలు, పన్నులు మరియు సుంకాల రూపంలో వారు భరించవలసిన భారం గురించి పౌరులకు ఒక అవగాహనను అందించే ఒక డాకుమెంట్.
- వివిధ రంగాల విధానాలు మరియు వాటికి ఇవ్వబడే కేటాయింపుల గురించి తెలుపుతుంది.
- వివిధ ప్రభుత్వ శాఖలకు సంబందించిన కార్యాచరణ ప్రణాళికలను తెలుపుతుంది.
- ప్రభుత్వ ఋణ అవసరాలు మరియు ప్రోత్సాహకాల గురించి మార్కెట్ؚకు సంకేతాన్ని అందిస్తుంది.
8. రాష్ట్ర మరియు కేంద్ర బడ్జెట్ల యొక్క ఉద్దేశ్యం ఒకటే. అయితే వాటి వ్యయ బాధ్యత నిర్వహణ మాత్రం వేరుగా ఉంటాయి.
వాస్తవాలు, సవరించిన అంచనాలు మరియు బడ్జెట్ అంచనాలు.
9. వివిధ సంవత్సరాల కోసం వివిధ రకాల అంచనాలను బడ్జెట్ సమర్పిస్తుంది.
10. బడ్జెట్ؚలో సమర్పించిన “వాస్తవ” గణాంకాలను అకౌంటెంట్ జనరల్ తయారు చేస్తారు మరియు కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తారు. వీటి వివరాలు కొంత ఆలస్యంగా ఇవ్వబడతాయి. ఉదాహరణకు, 2021-22 కోసం వాస్తవ గణాంకాలను 2023-24 బడ్జెట్ؚలో సమర్పిస్తారు.
11. సవరించిన అంచనాలు, అందుబాటులో ఉన్న నెలల యొక్క వాస్తవ గణాంకాల పైన మరియు ఆ సంవత్సరంలో మిగిలిన నెలల అంచనాలపై ఆధారపడి ఉంటాయి.
12. బడ్జెట్ అంచనాలు గత సంవత్సరం లోని శైలి మరియు రాబోయే ఆర్థిక సంవత్సరంలోని ఆదాయాల అంచనాలు మరియు వ్యయ ప్రాధాన్యతలపై ప్రవేశపెట్టబోయే విధాన మార్పుల ఆధారంగా తయారు చేయబడతాయి.
13. సాధారణంగా బడ్జెట్ అంచనాలు, వాస్తవాల కంటే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి ఎందుకంటే ఆదాయ వ్యయాలను ఎక్కువ చేసి చూయించే ధోరణే ఇందుకు కారణం. కాబట్టి ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా మాత్రమే బడ్జెట్ ఫలితాలను అంచనా వేయాలి.
రాజ్యాంగ నిబంధనలు
14. ఇవి వార్షిక ఆర్థిక నివేదిక లేదా బడ్జెట్ సమర్పించటం రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఉంటాయి. రాష్ట్ర ఆదాయం మరియు ఖర్చుల నివేదిక శాసనసభ మరియు శాసన మండలి లో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 (1) ఆదేశిస్తుంది. ఆర్టికల్ యొక్క క్లాజ్ (2) ప్రకారం, వార్షిక ఆర్థిక నివేదికలో వుండే వ్యయాన్ని రెండు విధాలుగా చూపించాలి. ఇవి ఛార్జ్డ్ వ్యయము మరియు రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఇతర ఖర్చులను తీర్చడానికి ప్రతిపాదించిన మొత్తం. ఇప్పుడు ఒక రాష్ట్ర ‘కన్సాలిడేటెడ్ ఫండ్’ మరియు ‘ఛార్జ్డ్ వ్యయాల’ గురించి తెలుసుకోవటం ముఖ్యం.
15. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని ఆదాయాలు, ట్రెజరీ బిల్లులను జారీ చేసి ప్రభుత్వం తీసుకునే అన్ని ఋణాలు, ఋణాలు లేదా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ మరియు ఋణాల చెల్లింపులో ఆ ప్రభుత్వం అందుకున్న మొత్తాలు అన్నీ రాష్ట్ర సంఘటిత నిధి (State Consolidated Fund) లో ఉంటాయి. ఆర్టికల్ 202 ప్రకారం, a) గవర్నర్ వేతనాలు మరియు భత్యాలు, అతని కార్యాలయానికి సంబంధించిన ఇతర వ్యయం; b) శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ వేతనాలు మరియు భత్యాలు; c) వడ్డీతో సహా రాష్ట్రం చెల్లించవలసిన ఋణ ఛార్జీలు, d) హైకోర్ట్ జడ్జీల వేతనాలు మరియు భత్యాలు; మరియు e) కోర్టు లేదా మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ యొక్క ఏదైనా తీర్పు, శాసనం లేదా తీర్పును సంతృప్తిపరచడానికి అవసరమైన మొత్తాలను రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు మరియు వీటికి శాసనసభ ఆమోదం అవసరం లేదు. ఇతర వ్యయ అంశాల కోసం రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా ఖర్చు చేయకూడదు.
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన
16. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 మరియు 267లో ఉండే నిబంధనలను అనుసరించి ఉంటుంది. ఇది కేంద్ర బడ్జెట్ మాదిరిగానే ఉంటుంది,
17. ఈ నిబంధనల ప్రకారం, (కేంద్ర మరియు) రాష్ట్ర బడ్జెట్లలో ప్రభుత్వం స్వీకరించే మరియు ఖర్చు చేసే మొత్తాలను మూడు భాగాలుగా నిర్వహిస్తారు.
ఇవి
భాగం I : రాష్ట్ర సంఘటిత నిధి
భాగం II : రాష్ట్ర అత్యవసర నిధి
భాగం III: రాష్ట్ర పబ్లిక్ ఖాతా
రాష్ట్ర సంఘటిత నిధులు
18. (రాష్ట్ర సంఘటిత నిధి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించే మొత్తం రాబడులు, ప్రభుత్వం తీసుకున్న అన్ని ఋణాలు మరియు ఋణాల చెల్లింపులో అందుకున్న మొత్తాల నుంచి ఏర్పడుతుంది (ఆర్టికల్ 266)). సంఘటిత నిధికి వచ్చిన రాబడులు వ్యయాలను సంబంధించిన లావాదేవీలను మూడు ఖాతాలలో నిర్వహిస్తారు. ఇవి:
- రెవెన్యూ ఖాతా
- మూలధన ఖాతా
- ఋణ ఖాతా
రెవెన్యూ ఖాతా
19. బడ్జెట్ రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ ఆదాయాలు మరియు రెవెన్యూ వ్యయాలు ఉంటాయి.
I. రెవెన్యూ రాబడులు
20. రెవెన్యూ రాబడులు ప్రభుత్వ ప్రస్తుత ఆదాయ స్వభావంలో ఉంటాయి. రెవెన్యూ రాబడులను పన్ను రాబడులు, పన్నేతర రాబడులు మరియు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ మరియు కంట్రిబ్యూషన్లుగా వర్గీకరించబడ్డాయి.
i) పన్ను రాబడి: పన్నులు మరియు సుంకాల విధింపులు మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్నుల వాటాలను ఈ శీర్షిక క్రింద చూపిస్తారు. అమ్మకపు పన్ను/VAT, రాష్ట్ర GST, ఎక్సైజ్ సుంకాలు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు, మోటార్ వాహనాలపై పన్నులు, విద్యుత్‌పై పన్ను మరియు సుంకము వంటివి రాష్ట్రానికి సొంతమైన ముఖ్య రాబడి వనరులు.
ii)పన్నేతర రాబడి: ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వడ్డీ చెల్లింపులు, మూలధన పెట్టుబడులపై డివిడెండ్ؚలు, అందించిన సేవలకు ఫీజులు, అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చిన రాబడి, గనులు మరియు ఖనిజాలపై రాయల్టీ, వివిధ ప్రభుత్వ విభాగాలు విధించే జరిమానాలు మరియు సేవలపై విధించే రుసుముల నుండి వచ్చిన రాబడిని పన్నేతర రాబడిగా వర్గీకరిస్తారు.
కేంద్ర పన్నులలో వాటా
21. ఎక్కువగా వచ్చే వనరులను కేంద్రానికి మరియు ఎక్కువ క్రియాత్మక బాధ్యతలు రాష్ట్రాలకు అప్పగించినందున కేంద్ర, రాష్ట్రాల రాబడులలో మరియు వాటి సంబంధిత బాధ్యతలలో అసమతుల్యత ఏర్పడుతుంది..
22. ఈ అసమతుల్యతను పరిష్కరించడానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 280, కేంద్ర పన్నుల నికర ఆదాయాలను కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పంపిణీని సిఫార్సు చేయడానికి ప్రతి ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత లేదా అంతకంటే ముందు ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. రాజ్యాంగం ప్రకారం, కేంద్ర పన్నుల నికర ఆదాయాలను రాష్ట్రాలతో పంచుకోవాలి. పదిహేనవ ఆర్ధిక సంఘం సిఫార్సు ప్రకారం, 2021-26 కాలంలో కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా 41 శాతంగా సిఫార్సు చేసింది. కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాని నిర్ణయించిన తరువాత, ఆర్ధిక సంఘం రాష్ట్రాల మధ్య వాటి సంబంధిత వాటాల కేటాయింపును కూడా సిఫార్సు చేస్తుంది.
గ్రాంట్-ఇన్-ఎయిడ్ మరియు కంట్రిబ్యూషన్లు:
23. భారత ప్రభుత్వం నుండి గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ؚ ఈ శీర్షిక క్రింద రికార్డ్ చేయబడతాయి.
24. ఉదాహరణకు, ‘రాష్ట్ర నిధులు- 2022-23 బడ్జెట్ల అధ్యయనం’ అనే పేరుతో ఉన్నరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వార్షిక పబ్లికేషన్ నుండి సేకరించిన ఉత్తరప్రదేశ్ రెవెన్యూ రాబడుల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
రెవెన్యూ రాబడులు – కూర్పు – ఉత్తరప్రదేశ్
(రూపాయలు కోట్లలో) | |||
అంశం | 2020-21 (వాస్తవ గణాంకాలు) | 2021-22 (సవరించిన అంచనాలు) | 2022-23 (బడ్జెట్ అంచనాలు) |
రెవెన్యూ రాబడులు (I+II+III+IV) | 296176 | 378731 | 499213 |
I. సొంత పన్ను రాబడి | 119897 | 160350 | 220655 |
i. అమ్మకాలు మరియు వాణిజ్యంపై పన్నులు | 22127 | 28655 | 36213 |
ii. రాష్ట్ర ఎక్సైజ్ | 30061 | 36212 | 49152 |
iii. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ | 16475 | 19745 | 29692 |
iv. వాహనాలపై పన్నులు | 6483 | 5950 | 10887 |
v. ఇతరములు | 44751 | 69789 | 94711 |
II. సొంత పన్నేతర రాబడి | 11846 | 15524 | 23406 |
1. వడ్డీ రాబడులు & డివిడెండ్ؚలు | 1220 | 2127 | 2200 |
2. సాధారణ సేవలు | 2239 | 1756 | 3193 |
3. సామాజిక సేవలు | 1046 | 1082 | 1836 |
4. ఆర్ధిక సేవలు | 7341 | 10459 | 16177 |
స్వంత రెవెన్యూ రాబడులు (I+II) | 131743 | 175874 | 244061 |
III. కేంద్ర పన్నులలో వాటా | 106687 | 114894 | 146499 |
IV. గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ | 57746 | 87963 | 108652 |
25. 2020-21 లెక్కల ప్రకారం, అమ్మకాలు మరియు వాణిజ్యంపై పన్నులు మరియు ఎక్సైజ్ సుంకాలు రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలలో సుమారు 44 శాతంగా ఉంది. ఈ శాతం సంపన్న రాష్ట్రాల్లో 70-80 శాతం మధ్య ఉండవచ్చు. మొత్తం రెవెన్యూ రాబడులలో, రాష్ట్రాల సొంత రెవెన్యూ వాటా 44.5 శాతంగా ఉంది, మిగిలినది కేంద్రం నుంచి వచ్చే పన్ను బదలాయింపు మరియు గ్రాంట్ల ద్వారా సమకూరుతోంది. కేంద్రం నుండి పన్ను బదలాయింపు మరియు గ్రాంట్లు, తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అధికంగా ఉంటాయి. ధనిక రాష్ట్రాలలో, మొత్తం రెవెన్యూ రాబడులలో సొంత రెవెన్యూ వాటా మరింత అధికంగా ఉంటుంది, ఎందుకంటే, రాష్ట్రాల మధ్య సమాంతర లేదా ఆదాయ అసమానతలను పరిష్కరించడానికి, ఇవి కేంద్రం నుంచి తక్కువ పన్ను బదలాయింపుని మరియు గ్రాంట్ؚలను అందుకుంటాయి.
II. రెవెన్యూ వ్యయం
26. రెవెన్యూ వ్యయం రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత వ్యయాన్ని సూచిస్తుంది. ఇది ప్రభుత్వాన్నినడపడానికి అయ్యే రోజూవారీ ఖర్చు. ఈ వ్యయం ప్రభుత్వం చేసిన రుణాలపై వడ్డీ చెల్లింపులు సాగునీరు మరియు విద్యుత్ ప్రాజెక్టులు, భవనాలు మొదలైన వివిధ మూలధన ఆస్తుల నిర్వహణ మరియు మరమ్మత్తుల కోసం అయ్యే వ్యయం. విస్తృత అర్ధంలో, ఏదైనా స్థిరాస్తిని సృష్టించని వ్యయాన్ని రెవెన్యూ వ్యయంగా వర్గీకరిస్తారు. కానీ మూలధన ఆస్తుల నిర్వహణ మరియు వాటి రోజువారి ఖర్చులు రెవిన్యూ వ్యయం గా పరిగణించబడుతుంది.
27. రెవెన్యూ వ్యయం అనేది రాష్ట్ర ప్రభుత్వ అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన ఖాతా. ఇటీవలి సంవత్సరాల ఉత్తరప్రదేశ్ రెవిన్యూ వ్యయం సారాంశం క్రింద ఇవ్వబడింది.
రెవెన్యూ వ్యయం కూర్పు –ఉత్తరప్రదేశ్ | |||
(రూపాయలు కోట్లలో) | |||
అంశం | 2020-21 (వాస్తవ గణాంకాలు) | 2021-22 (సవరించిన అంచనాలు) | 2022-23 (బడ్జెట్ అంచనాలు) |
రెవెన్యూ వ్యయం(1+2+3+4) | 298543 | 356624 | 456089 |
1. సాధారణ సేవలు (a+b+c) | 119058 | 139316 | 177670 |
a. పన్నుసేకరణ | 4070 | 4780 | 5804 |
b. పరిపాలనా సేవలు | 25156 | 31077 | 39661 |
c. ఇతరములు | 89832 | 103458 | 132205 |
2. సామాజిక సేవలు | 109727 | 127199 | 169118 |
3. ఆర్ధిక సేవలు | 55551 | 73610 | 91301 |
4. గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ మరియు కంట్రిబ్యూషన్ | 14208 | 16500 | 18000 |
28. సాధారణ సేవలు, సామాజిక మరియు ఆర్ధిక సేవల వివరాలు క్రింద తెలుపబడ్డాయి.
సాధారణ సేవలు | సామాజిక సేవలు | ఆర్ధిక సేవలు |
రాష్ట్ర ప్రధాన విభాగాలు,ఆర్ధిక సేవలు,వడ్డీ చెల్లింపులు మరియు ఋణ సేవలు,పరిపాలనా సేవలు, పెన్షన్లు మరియు ఇతర సాధారణ సేవలు, మరియుఇతర ఆర్ధిక సేవలు | విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతి, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం ,నీటి సరఫరా, పారిశుధ్యం, గృహనిర్మాణం మరియు పట్టణ అభివృద్ధి హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్, సమాచారం మరియు ప్రచారం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం, కార్మిక మరియు కార్మిక సంక్షేమం, సాంఘిక సంక్షేమం మరియు పోషకాహారం .(ఇతరములు) | వ్యవసాయం మరియు సహకార కార్యకలాపాలు , గ్రామీణ అభివృద్ధి, సాగునీరు మరియు వరద నియంత్రణ విద్యుత్, పరిశ్రమ మరియు ఖనిజాలు, రవాణా, సైన్స్ మరియు టెక్నాలజీ మరియు పర్యావరణం మరియు సాధారణ ఆర్ధిక సేవలు |
III. మూలధన ఖాతా:
29. మూలధన వ్యయం అనేది ఆర్థిక సంపదను పెంచే స్వభావం కల వ్యయాలను నమోదు చేస్తుంది. ఇవి భూమి కొనుగోలు, నీటి పారుదల మరియు విద్యుత్ ప్రాజెక్ట్ల నిర్మాణం, భవనాల నిర్మాణం మొదలైన దీర్ఘకాలిక స్వభావం ఉన్న ఆస్తులను సృష్టించడంలో అయ్యే ఖర్చులు. నిర్దేశించిన పరిమితులను మించితే, యంత్రాల కొనుగోలుకు చేసిన వ్యయాన్ని కూడా మూలధన వ్యయంగా పరిగణిస్తారు. పై అంశాలకు అదనంగా పబ్లిక్ సంస్థలు మరియు సహకార సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను కూడా మూలధన వ్యయంగా పరిగణిస్తారు. మూలధన వ్యయం కోసం ఎక్కువగా రుణాల రూపంలో సమీకరిస్తారు. ఇదే కాకుండా మూలధన వ్యయం కోసం రెవెన్యూ ఖాతాలోని మిగులును కూడా ఉపయోగించ వచ్చు. ఇది అనువైనది ఎందుకంటే ఇది ఋణ భారాన్ని తగ్గిస్తుంది. కానీ ఇటువంటి సందర్భాలు తక్కువ మరియు అరుదు.
మూలధన రాబడులు
30. మూలధన రాబడులలో ప్రధానంగా ఋణాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాల చెల్లింపులు ఉంటాయి. మూలధన ఖాతా క్రింద ప్రధాన హెడ్ వారీగా వ్యయాన్ని బడ్జెట్ పబ్లికేషన్ల వాల్యూమ్‌లో “రెవెన్యూ ఖాతా వెలుపల మూలధన వ్యయం ఇ-స్టేట్ؚమెంట్ؚ” అని పిలిచే స్టేట్ؚమెంట్ؚలో చూపుతారు. అటువంటి వ్యయ వివరాలను సంబంధిత వాల్యూమ్ؚలో బడ్జెట్ పబ్లికేషన్లలో చూపుతారు. ఇటీవలి సంవత్సరాల ఉత్తరప్రదేశ్ మూలధన ఖాతా సారాంశం క్రింద ఇవ్వబడింది.
ఉత్తరప్రదేశ మూలధన ఖాతా | |||
(రూపాయలు కోట్లలో) | |||
అంశం | 2020-21 (వాస్తవ గణాంకాలు) | 2021-22 (సవరించిన అంచనాలు) | 2022-23 (బడ్జెట్ అంచనాలు) |
I. మూలధన రాబడులు | 91744 | 96786 | 87739 |
II. మూలధన వ్యయం | 52237 | 96481 | 123920 |
1. సాధారణ సేవలు | 1523 | 5052 | 7380 |
2. సామాజిక సేవలు | 12386 | 31981 | 44914 |
3. ఆర్ధిక సేవలు | 38328 | 59447 | 71626 |
III. మూలధన పంపిణీలు | 26777 | 28733 | 22563 |
మొత్తం మూలధన వ్యయం మరియు పంపిణీలు (II+III) | 79015 | 125214 | 146483 |
31. ఆర్టికల్ 293 ప్రకారం, మూలధన రాబడులలో ప్రధానంగా, కేంద్రం అనుమతించిన ఓపెన్ మార్కెట్ ఋణాలు, కేంద్రం మరియు ఇతర సంస్థలు ఇచ్చిన ఋణాలు ఉంటాయి. ఆర్ధిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం (FRBM Act) క్రింద నిర్దేశించిన పరిమితుల ప్రకారం రాష్ట్ర వార్షిక ఋణాలు నిర్ణయించబడతాయి. పన్నెండవ ఆర్ధిక సంఘం సిఫార్సులను అనుసరించి అన్నీ రాష్ట్రాలు 2005లో ఈ చట్టాన్ని అమలు చేశాయి. ఎప్పటికప్పుడు సవరించే ఈ చట్టం ప్రకారం, ఋణ పరిమితులను, సాధారణంగా GSDPలో 3 శాతంగా నిర్ణయిస్తారు, తమ ఆదాయ బడ్జెట్లను సంతులనం చేయాలని, ఆర్ధిక లోటును GSDPలో 3 శాతం ఉండేలా నిర్వహించాలని FRBM చట్టంలో నిర్దేశించబడింది. అయితే, ఈ పరిమితులు ఆర్ధిక సంఘం మరియు కేంద్ర ప్రభుత్వం అనుమతించే సడలింపులకి లోబడి ఉంటాయి. మూలధన పంపిణీలలో ప్రధానంగా ప్రభుత్వ ఋణాలు మరియు కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఋణాలు మొదలైన వాటి చెల్లింపు ఉంటాయి.
బడ్జెట్ లోటు కొలమానాలు
32. ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణలో ముఖ్యమైన సూత్రం, రెవెన్యూ ఖాతా ఎప్పుడూ లోటులో ఉండకూడదు.రెవెన్యూ అధిక ఆదాయాలు అంటే రెవెన్యూ ఖర్చుల కంటే అధికంగా ఉన్న రెవెన్యూ రాబడులు. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రాబడుల కంటే ఎక్కువగా ఉండే రెవెన్యూ ఖర్చులు. రెవెన్యూ లోటులను అప్పు చేయడం ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుత వ్యయం కోసం అప్పు చేయడం ఆర్ధికంగా స్థిరమైనది కాదు.
33. ద్రవ్య లోటు అంటే రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఆదాయాలు మరియు మొత్తం వ్యయం మధ్య ఉండే తేడా (రెవెన్యూ మరియు మూలధనం). ఇది ఒక సంవత్సరంలో రాష్ట్రంలో నికర అప్పులను సూచిస్తుంది. ఆర్ధిక లోటు హేతుబద్ధమైన పరిమితులలో ఉండాలి. లేకపోతే, వడ్డీ చెల్లింపులు మరియు ఋణ చెల్లింపులు బడ్జెట్ వనరులలో ఎక్కువ భాగాన్ని హరిస్తాయి మరియు ప్రభుత్వాలు మరింత ఎక్కువ ఋణాలు తీసుకునేలా చేస్తాయి.
రాష్ట్ర పబ్లిక్ ఖాతా
34. బడ్జెట్ యొక్క పబ్లిక్ అకౌంట్ అనేది ప్రభుత్వ బ్యాంకర్ గా వ్యవహరించే లావాదేవీలకు సంబంధించినది, స్వీకరించిన డబ్బుని తిరిగి చెల్లించే బాధ్యత కలిగి ఉంటుంది.
35. వీటిలో కాంట్రాక్టర్లు, వర్తకులు మొదలైన వారు సెక్యూరిటీ డిపాజిట్ؚగా ప్రభుత్వ ఖజానాలలో డిపాజిట్ చేసే మొత్తాలు ఉంటాయి. వ్యాజ్యాలకు సంబంధించి కోర్టులకు కూడా డిపాజిట్లు చెల్లిస్తారు. స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలు వాటి నిధులను, వాస్తవంగా ఉపయోగించే వరకూ, వివిధ ప్రయోజనాల కోసం పబ్లిక్ ఖాతాలో ఉంచుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను, సంబంధిత ఉద్యోగుల చెల్లించవలసిన గడువు వచ్చే వరకు ప్రభుత్వం తమ వద్ద ఉంచుతుంది. ఈ నిధులు అన్నీ నిజానికి ప్రభుత్వానికి చెందినవి కావు. కానీ వీటిని ప్రభుత్వ నిధిగానే లెక్కిస్తారు. గడువు తేదీ వచ్చినప్పుడు సంబంధిత పార్టీలకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఈ లావాదేవీలన్నిటినీ “పబ్లిక్ ఖాతా”తో సంఘటిత నిధిగా కాకుండా ప్రత్యేకంగా నమోదు చేస్తారు. ఇవి సాధారణ బ్యాంకింగ్ లావాదేవీల స్వభావంలో ఉంటాయి కాబట్టి ఈ మొత్తాల చెల్లింపుకు శాసన సభ ఆమోదం అవసరం లేదు.
36. రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వం తరఫున అందుకున్న డబ్బు మరియు రాష్ట్ర సంఘటిత నిధికి క్రెడిట్ చేయని పబ్లిక్ నిధులు అన్నిటినీ, “పబ్లిక్ ఖాతా” క్రింద లెక్కిస్తారు.
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఖాతాకు సంబంధించిన లావాదేవీలు క్రింద క్లుప్తంగా ఇవ్వబడ్డాయి.
పబ్లిక్ ఖాతా వివరాలు | |||
(రూపాయలు కోట్లలో) | |||
అంశం | 2020-21 (వాస్తవ గణాంకాలు) | 2021-22 (సవరించిన అంచనాలు) | 2022-23 (బడ్జెట్ అంచనాలు) |
I. రసీదులు | 1807147 | 461914 | 464516 |
1. చిన్న మొత్తాల పొదుపు & ప్రావిడెంట్ నిధులు | 11289 | 15150 | 15150 |
2. రిజర్వ్ నిధులు | 5431 | 8047 | 9865 |
3. డిపాజిట్లు మరియు అడ్వాన్స్ؚలు | 20021 | 19244 | 19244 |
4. సస్పెన్స్ మరియు ఇతరాలు | 1732323 | 414974 | 415758 |
5. చెల్లింపులు | 38082 | 4500 | 4500 |
II. పంపిణీలు | 1812606 | 456414 | 458516 |
1. చిన్న మొత్తాల పొదుపు & ప్రావిడెంట్ నిధులు | 10226 | 13447 | 13447 |
2. రిజర్వ్ నిధులు | 5931 | 8448 | 10446 |
3. డిపాజిట్లు మరియు అడ్వాన్స్ؚలు | 18107 | 22104 | 22104 |
4. సస్పెన్స్ మరియు ఇతరాలు | 1739934 | 407416 | 407519 |
5. చెల్లింపులు | 38408 | 5000 | 5000 |
నికర పబ్లిక్ ఖాతా (I-II) | -5458 | 5500 | 6000 |
నిధుల కోసం డిమాండ్ؚలు
37. నిధుల కోసం డిమాండ్ؚలు అంటే రాష్ట్ర బడ్జెట్ؚలో ప్రత్యేక వాల్యూమ్ؚగా సమర్పించిన ప్రభుత్వంలోని ప్రతి విభాగం వ్యయ డిమాండ్ؚలు.
38. ప్రతి విభాగానికి, ప్రస్తుత సంవత్సరం మరియు బడ్జెట్ సంవత్సరంలో ఖర్చులకు కావలసిన నిధుల డిమాండ్ؚలో చేర్చబడిన బడ్జెట్ వనరుల విభాగం-వారీ వివరాలు మరియు గత సంవత్సరపు వాస్తవాలతో పాటు, ప్రస్తుత సంవత్సరానికి సవరించిన అంచనాలు కూడా ఉంటాయి. ఈ వనరుల విభజనను చిన్న-శీర్షికలు, ఉప-శీర్షికలు మరియు ఉప-వివరణాత్మక శీర్షికలు క్రింద చూపుతారు. ప్రతి ఉప వివరణాత్మక శీర్షిక క్రింద, అంశాలవారీగా వ్యయాలను చూపుతారు. ఉదాహరణకు, వివరణాత్మక శీర్షిక ‘010 జీతాలు’ క్రింద, జీతభత్యాలు, కరువు భత్యం మొదలైన వివరాలను చూపుతారు. ఈ వివరాలు, ప్రతి కార్యక్రమం మరియు పధకానికి వనరుల గురించి మరియు ప్రతి పధకం కింద డబ్బును ఎలా ఖర్చు చేయడానికి ప్రతిపాదించారు అనే విషయాలను శాసనసభ్యులు మరియు పౌరులు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఈ వివరాలు, ఒక కార్యక్రమానికి వనరులు ఎలా పెరుగుతున్నాయి లేదా తగ్గుతున్నాయి అనే విషయాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే వీలు కల్పిస్తాయి.
సారాంశం
39. ఈ సమగ్రమైన పరిచయం వలన, బడ్జెట్ؚలో మనకు కావాల్సిన సమాచారాన్ని ఎక్కడ ఉందొ తెలుసుకోవొచ్చు. ఈ క్రింది పట్టిక, వెతుకుతున్న సమాచారాన్ని గుర్తించేందుకు వీలు కల్పిస్తుంది.
దేని కోసం చూస్తున్నారు | ఎక్కడ కనుగొనాలి |
పూర్తి రాబడి, మొత్తం రెవెన్యూ వ్యయం, అప్పులు, మూలధన వ్యయం, రెవెన్యూ మరియు ఆర్ధిక లోటు మొదలైన వాటి స్థూల సమీకరణలు. | క్లుప్తంగా బడ్జెట్ (Budget-in-Brief) |
రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు మరియు వ్యయం. | వార్షిక ఆర్ధిక నివేదిక |
గత ఆర్ధిక సంవత్సరాలలో రంగాల వారీగా మరియు విభాగాల వారీగా కేటాయింపులు మరియు ఖర్చుల సారాంశం. | గ్రాంట్ల కోసం డిమాండ్ సారాంశం |
రెవెన్యూ మరియు మూలధనం రెండిటి రాబడుల వివరణాత్మక అంచనాలు | రాబడుల బడ్జెట్ |
కేటాయింపులు మరియు వ్యయాలపై విభాగం-వారీ మరియు ఉప-విభాగంవారీ వివరణాత్మక సమాచారం | సంబంధిత విభాగాల గ్రాంట్ల కోసం వివరణాత్మక డిమాండ్లు |
స్థానిక సంస్థలకు బదిలీలు, జీతాలు మరియు వేతనాలపై వ్యయం | బడ్జెట్ అంచనాలకి అనుబంధాలు |
విభాగం-వారీగా ఉద్యోగుల సంఖ్య | ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యపై అనుబంధం |
ప్రభుత్వ సంస్థల సమాచారం | ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బడ్జెట్ సంచిక |
స్థూల ఆర్ధిక విధానం, మధ్య-కాలిక ఆర్ధిక విధానం, ఆర్ధిక వ్యూహాల నివేదికలు. | ఆర్ధిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఆదేశం ప్రకారం రాష్ట్ర శాసనసభకు సమర్పించిన ఆర్ధిక విధాన స్టేట్మెంట్ |