పదహారవ ఫినాన్స్ కమిషన్ ముందున్న అంశాలు

జి.ఆర్. రెడ్డి

డాక్టర్ అరవింద్ పనగరియ చైర్మన్ గా పదహారవ ఫినాన్స్ కమిషన్ (FC-XVI) 2023 డిసెంబర్ 31న
ఏర్పాటైంది.

ఈసారి కమిషన్ ముందున్న పరిశీలనాంశాలు (టీఓఆర్) రాజ్యాంగంలోని 280వ అధికరణంలో పేర్కొన్నవాటికే పరిమితమయ్యాయి. కనుక, ముందటి కమిషన్ల పరిశీలనాంశాలకంటే ఇవి చాలా చిన్నవి. ఇవి (i) కేంద్రం రాబడిలో రాష్ట్రాలకు ఎంత మొత్తం ఇవ్వాలి (వెర్టికల్ పంపకం), (ii) పంపకం చేయతగిన కేంద్ర పన్నుల రాబడిలో ప్రతి రాష్ట్రం యొక్క వాటాను నిర్ణయించడం (హారిజాంటల్ పంపిణీ), (iii) సాయం అవసరమైన రాష్ట్రాలకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ సిఫార్సు చేయడం మరియు ( iv) రాష్ట్రాలలోని పంచాయతీలు, పురపాలక సంస్థల వనరులకు దోహదం చేసే విధంగా ఆయా రాష్ట్రాల సంచిత నిధులను పెంపొందించే చర్యలను సిఫార్సు చేయడం.

బలమైన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి రాజ్యాంగంలోని 280వ అధికరణం (2) (సి) కింద మరి ఏ ఇతర అంశాన్ని అయినా కూడా కమిషన్ కు అప్పగించవచ్చు. ఈసారి విపత్తుల నిర్వహణ ఫినాన్సింగ్ కు ఇప్పుడున్న ఏర్పాట్లను సమీక్షించి, సముచితమైన సిఫార్సులు చేయడాన్ని మాత్రమే టీఓఆర్ లో అదనపు అంశంగా చేర్చారు.

ఇంతకుముందరి కమిషన్ల టీఓఆర్ లకు ముఖ్యంగా పదిహేనవ ఫినాన్స్ కమిషన్ (FC-XV) కు ఇవి పూర్తి భిన్నంగా ఉండి అత్యంత వివాదాస్పదంగా పరిణమించాయి. (FC-XV) టీఓఆర్ లో వివాదాస్పదంగా మారిన వేవంటే, (i) రాబడి లోటు గ్రాంట్లను రాష్ట్రాలకు అసలు సమకూర్చవచ్చా, (ii) రక్షణ, ఆంతరంగిక భద్రతకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా?, ఉన్నట్లయితే, అటువంటి యంత్రాంగం పనిచేసేట్లు చేయడం ఎలా? మరియు (iii) భారత ప్రభుత్వ అగ్రశ్రేణి పథకాల లక్ష్యాల సాధనలో సాధించిన ప్రగతితోపాటు దాదాపు తొమ్మిది అంశాలలో పనితీరును గణించే ప్రతిపాదనలు.

సిఫార్సులు చేసేటపుడు ఫినాన్స్ కమిషన్ లెక్కలోకి తీసుకునే అంశాలను FC-XVI టీఓఆర్ లో పేర్కొనలేదు. ఈ విషయంలో గత విధానాల నుంచి వైదొలగారు. కేంద్ర మంత్రివర్గం 2023 నవంబర్ లో టీఓఆర్ కు ఆమోదం తెలిపాక నిర్వహించిన పత్రికా సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ మాట్లాడుతూ, ఇటీవలి కమిషన్ల కంటే, దీని పరిశీలనాంశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇవి అన్నింటినీ ఇముడ్చుకుని ఉన్నాయని అన్నారు. వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా, వారు అభిప్రాయాలు వ్యక్తపరచేందుకు మరింత వెసులుబాటు కల్పించామని చెప్పారు. రాష్ట్రాలతో సంప్రదించాకే టీఓఆర్ తయారు చేశామని ఆయన స్పష్టం చేశారు.

ఫినాన్స్ కమిషన్ నియామకం ముఖ్యమైన ఘట్టం. దాని సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కలుగుజేయడమే కాకుండా, దేశంలో ఫిస్కల్ పెడరలిజం భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.

ఇటీవలి సంవత్సరాలలో భారతీయ ఫిస్కల్ ఫెడరలిజంలో దీర్ఘకాలిక ప్రాముఖ్యం కలిగిన అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మరి ఏ ఇతర అంశానికి లేదా అనేక అదనపు అంశాలకు కట్టుబడి ఉండనవసరం లేదు కనుక ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని , కేంద్రం, రాష్ట్రాలు మధ్య పెరుగుతున్న అపనమ్మకం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రస్తుత కమిషన్ కు మరింత వెసులుబాటు ఉంది. ఫిస్కల్ ఫెడరలిజాన్ని శాసించే రాజ్యాంగ నిబంధనల స్ఫూర్తిని పరిరక్షించే చర్యలను కూడా అది సిఫార్సు చేయవచ్చు. సహకార ఫెడరలిజాన్ని ప్రోత్సహించే లక్ష్యాన్ని సాధించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను FC-XVI సూచించవచ్చు. దేశానికున్న వృద్ధి సామర్థ్యాన్ని వెలికితీయడంలో, ప్రగతి సాధనలో రాష్ట్రాలను  సమాన భాగస్వాములుగా చేయడానికి సూచనలు చేయవచ్చు.

FC-XVI ముందున్న అంశాలు

1. పన్నులు, సెస్సులు, సర్ చార్జీల వికేంద్రీకరణ పవిత్రతను కాపాడడం
నూతన ఫినాన్స్ కమిషన్ దృష్టికి వెళ్ళి తీరాల్సిన అంశాలు ఏమిటి? పన్నుల వికేంద్రీకరణ పవిత్రతను నిర్వహించడం అన్నింటికన్నా మొదటి అంశం. కేంద్ర పన్నులకు సంబంధించి భాగింపతగిన తటాకంలో రాష్ట్రాల వాటా ప్రస్తుతం 41 శాతంగా ఉంది. కానీ, సాపేక్షంగా చూస్తే, దీన్ని పెంచడానికి ఉన్న పరిధి పరిమితం. కారణం. కేంద్రం కట్టుబడి ఉండాల్సిన అప్పులే. కనుక, దాన్ని సడలించడం పెద్ద సమస్య అవుతుంది.

స్థూల పన్నుల రాబడిలో పన్ను వికేంద్రీకరణ శాతం 2011-12లో 28.2 శాతంగా (సిఫార్సు చేసింది 32 శాతం కాగా, 2020-21లో 29.4 శాతంగా (సిఫార్సు చేసింది 41 శాతం కాగా)) ఉంది. కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా 41 శాతంగా ఉండాలని సిఫార్సు కాగా, ప్రస్తుతం అది 31 శాతంగా మాత్రమే ఉంది.
రాష్ట్రాలకు ఇవ్వాల్సినదానికి, వాస్తవంగా ఇస్తున్న దానికి మధ్య వ్యత్యాసం 2011-12లో ఉన్న 4 శాతం నుంచి 2020-21 నాటికి 10 శాతానికి పెరిగింది. కేంద్రం విచక్షణారహితంగా సెస్సులు, సర్ చార్జీల విధింపునకు దిగడమే దీనికి కారణం.

సెస్సులు, సర్ చార్జీల రాబడిని, రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. స్థూల పన్నుల రాబడిలో సెస్సులు, సర్ చార్జీల వాటా 2011-12లో ఉన్న 10.4 శాతం నుంచి 2020-21 నాటికి 20.1 శాతానికి పెరిగింది. జి.ఎస్.టి. ప్రవేశంతో సెస్సులలో చాలా భాగం దానిలోనే కలిసిపోతాయనే అంచనాలు వమ్ము అయ్యాయి. ఫలితంగా, కేంద్ర స్థూల పన్నుల రాబడిలో రాష్ట్రాలకు చెందాల్సిన వాటా సిఫార్సు చేసిన దానికన్నా చాలా తక్కువగా ఉంటోంది. రాాజ్యాంగం ప్రకారం, కేంద్ర పన్నుల రాబడిని, వసూళ్ళకయ్యే నికర వ్యయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాల్సి ఉంటుంది. వసూళ్ళకయ్యే వ్యయం పన్నుల రాబడిలో 1 నుంచి 2 శాతంకన్నా మించి ఉండడం లేదు. వసూళ్ళకయ్యే వ్యయాన్ని పంచుకున్న

తర్వాత కూడా, వాస్తవిక పన్నుల రాబడి పంపకం సిఫార్సు చేసిన వాటాకన్నా గణనీయంగా తక్కువగా ఉంటోంది. కేంద్ర పథకాలు, కేంద్ర సౌజన్యంతో నడిచే పథకాలకు నిధులు సమకూర్చడానికి సెస్సులు, సర్ చార్జీలు హెచ్చుగా విధించడం వల్ల , పధ్నాల్గవ ఫినాన్స్ కమిషన్ రాష్ట్రాలకు హెచ్చు వాటాను సిఫార్సు చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది.

నిర్దిష్ట అవసరం కోసం, నిర్దిష్ట కాల పరిమితిలో అరుదుగా మాత్రమే సెస్సులు, సర్ చార్జీలు విధించాలని ఒక కమిషన్ తర్వాత మరో కమిషన్ వ్యాఖ్యానిస్తూనే ఉన్నాయి. వీటికి ఏదో ఒక స్థాయి వద్ద పరిమితి విధించడం మంచిదని ఫినాన్స్ కమిషన్లు పలుమార్లు హితవు పలికినప్పటికీ, కేంద్రం లెవీలపై ఆధారపడడం ఏళ్ళ తరబడి పెరుగుతూనే ఉంది. భారతదేశపు పన్నుల వ్యవస్థలో సెస్సులు, సర్ చార్జీలు ఇంచుమించు శాశ్వతమైనవిగా పరిణమించాయని, FC-XV సౌజన్యంతో నిర్వహించిన అధ్యయనంలో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వ్యాఖ్యానించింది. సెస్సులు, సర్ చార్జీలు విధించడానికి కారణమవుతున్న కర్లవ్యాలు విస్తృతమైనవిగా, ఎడతెగనివిగా ఉంటున్నాయి. ఆందోళనకరమైన సంగతి ఏమంటే, రాష్ట్రాల జాబితా లోనున్న అంశాలపైన కూడా సెస్సులు విధిస్తున్నారు. పైగా, సెస్సుల వచ్చిన రాబడి వినియోగంపై పారదర్శకత ఉండడం లేదు. కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలలో కయ్యానికి కారణమవుతున్న ఈ సమస్యకు పదహారవ కమిషన్ పరిష్కారం చూపవలసి ఉంది.

2. కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి కోత పెడుతున్నాయి

సెస్సులు, సర్ చార్జీలకు సంబంధించిన మరో ఇబ్బంది కేంద్ర ప్రాయోజిత పథకాలు (సి.ఎస్.ఎస్) వ్యాప్తి చెందినవి కావడం. వాటిలో చాలా వాటికి కేంద్రం పాక్షికంగానే నిధులిస్తోంది. వీటిలో చాలా భాగం పథకాలు రాష్ట్రాల జాబితాలోనున్న అంశాలతో ముడిపడినవి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు మాత్రమే సి.ఎస్.ఎస్ పరిమితం చేయవలసిందని భారత ప్రభుత్వం నియమించిన అనేకానేక కమిటీలు సిఫార్సు చేశాయి. ఇంతవరకు వాటిని స్థూలంగా 28 గొడుగుల కిందకు తీసుకురావడం తప్పించి, వాటి సంఖ్యను ప్రయోజనకరమైన రీతిలో తగ్గించడం జరగలేదు. “ఏకంగా 28 అనే సంఖ్య తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదనడంలో సందేహం లేదు” అని వివేక్ దేవరాయ్ వ్యాఖ్యానించారు. సక్గ్రమంగా లెక్కిస్తే , సి.ఎస్.ఎస్ సంఖ్య పాక్షికంగా, సి.ఎస్.ఎస్ కు ఒకరిచ్చే నిర్వచనంపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ సంఖ్య దాదాపు 200 ఉండవచ్చు.””రాష్ట్రాలతో సంప్రదించకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలకు కొత్త రూపు ఇవ్వకూడదు.” ఫినాన్షియల్ ఎక్స్ ప్రెస్, 2019, సెప్టెంబర్ 12)

ప్రస్తుతం కొనసాగుతున్న సి.ఎస్.ఎస్ ను ఐదేళ్ళ కొకసారి సమీక్షించి, ఫినాన్స్ కమిషన్ల అవార్డు కాలానికి, అవి కూడా ముగిసేట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సి.ఎస్.ఎస్ గడువు FC-XIV సిఫార్సుల కాలపరిమితితోపాటు 2020 మార్చి 31 నాటికి ముగియవలసి ఉంది. కానీ, కేంద్రం ఇంతవరకు అలాంటి సమీక్ష ఏదీ చేయలేదు. అంతేకాదు. నీతి ఆయోగ్ నియమించిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ 2015లో తన నివేదికను సమర్పించింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకే కేంద్ర పథకాలను పరిమితం చేయవలసిందని అది సిఫార్సు చేసింది. సి.ఎస్.ఎస్ కున్న “అందరికీ ఒకే తరహా” స్వభావ సమస్యను పరిష్కరించి ఐచ్ఛిక పథకాలను ప్రవేశపెట్టవలసిందని కూడా
కమిటీ కోరింది. వాటిని కేంద్రం ఆమోదించినా, ఎనిమిదేళ్ళకు పైగా గడుస్తున్నా, ఆ సిఫార్సులను సమర్థంగా అమలు చేసిన జాడలు లేవు.

సి.ఎస్.ఎస్ కింద గ్రాంట్లు పన్నుల వికేంద్రీకరణను మినహాయించగా, స్థిరంగా, ఎఫ్.సి బదలాయింపులను మించి ఉంటున్నాయి. ఉదాహరణకు, ఎఫ్.సి గ్రాంట్లు 2015-16లో రూ. 84,579 కోట్లు కాగా, రాష్ట్రాలకు సి.ఎస్.ఎస్ బదలాయింపులు దానికి రెండింతలకు పైగా రూ. 1,75, 736 కోట్ల
మేరకు ఉన్నాయి. సి.ఎస్.ఎస్. బదలాయింపులు 2022-23లో ఎఫ్.సి. గ్రాంట్ల కన్నా 100 శాతం మించి రూ. 3,46,992 కోట్ల మేరకు ఉన్నాయి. అందరికీ ఒకే తరహా రీతిలో రూపొందిన సి.ఎస్.ఎస్ లు చాలా ఉండడం, వాటికి కేటాయింపులు అరకొరగా ఉండ డం వల్ల , వాటి ప్రయోజనాలు గణనీయంగా
తరిగిపోతున్నాయి.

. రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రాలకు గ్రాంట్ల ప్రధాన వాహినిని నిర్ణయించేది ఫినాన్స్ కమిషనే. సి.ఎస్.ఎస్. గ్రాంట్లను రాజ్యాంగంలోని 282 అధికరణం కింద మంజూరు చేస్తారు. తొమ్మిదవ ఫినాన్స్ కమిషన్ అభ్యర్థన మేరకు ప్రసిద్ధ న్యాయ కోవిదుడు ఎన్.ఏ. పాల్కీవాలా అభిప్రాయపడిందేమంటే, “కేంద్రం అటువంటి గ్రాంట్లు చేయడం కోసం 282 అధికరణం ఉద్దేశించబడలేదు. అవి 275 అధికరణం కిందనే వెళ్ళాలి. 282 అధికరణం కేవలం అవశేష నిబంధన మాత్రమే. మంజూరు చేస్తున్నవారికి ఆ అంశంపై లెజిస్లేటివ్ సమర్థత ఉన్నదో, లేదోతో నిమిత్తం లేకుండా, కేంద్రం లేదా రాష్ట్రం ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా ఎటువంటి గ్రాంటు మంజూరు చేయడానికైనా వీలుగా ఆ నిబంధన రూపొందింది.”; పెరుగుతున్న సి.ఎస్.ఎస్ ల సంఖ్య తమ స్వయం ప్రతిపత్తికి కోత పెడుతోందని రాష్ట్రాలు సహజంగానే ఆందోళన చెందుతున్న దృష్ట్యా, సహకార ఫెడరలిజాన్ని ప్రోత్సహించవలసిన ప్రయోజనాల రీత్యా ఈ సమస్యను FC-XV పరిష్కరించాల్సిన తక్షణావసరం ఎంతైనా ఉంది. సెస్సులు, సర్ చార్జీలు, సి.ఎస్.ఎస్ లకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తే, రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్ర వ్యయం పనిలోపనిగా తగ్గిపోతుంది. కేంద్ర వ్యయం 2002-05 నుంచి 2005-11 మధ్యలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై సగటున 14 శాతం నుంచి 20 శాతానికి, ఉమ్మడి జాబితాలోని అంశాలపై వ్యయం సగటున 13 శాతం నుంచి 17 శాతానికి పెరిగిందని FC-XIV వ్యాఖ్యానించింది.

3. ఉచిత పథకాలు

FC-XIV పరిష్కరించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమంటే, 'ఉచిత పథకాల' సంస్కృతిని రాష్ట్రాలు, కేంద్రం రెండూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ జాడ్యాన్ని అరికట్టాలి. కొన్ని రాష్ట్రాలు పాత పింఛను వ్యవస్థకు మళ్ళి దేశ ద్రవ్య స్థిరతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్రం, చాలా రాష్ట్రాలు జీతభత్యాలను 2026లో సవరించనున్నాయి. ఆ ప్రక్రియ కూడా ఫినాన్సులపై ఒత్తిడి తేనుంది. మొత్తం సబ్సిడీలన్నీ ఉచితాలు కావు. సబ్సిడీల స్వభావం లేని, సంక్షేమాన్ని పెంపొం దించేవికాని, ఉచిత పథకాలను అరికట్టే యంత్రాంగాన్ని రూపొందించేందుకు, ఈ అంశంపై ఒక ఏకాభిప్రాయ సాధనకు దీనితో ప్రమేయమున్న అందరితో ఫినాన్స్ కమిషన్ సంప్రదింపులు జరపడంలో తప్పు లేదు. ఈ కర్తవ్య
నిర్వహణకు కమిషన్ ప్రోత్సహించే/నిరుత్సాహ పరచే చర్యలను ప్రవేశపెట్టే అంశాన్ని సైతం పరిశీలించవచ్చు.

4. ద్రవ్య పటిష్టత రూపురేఖలు
ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి 2018లో సవరణలు చేశారు. కేంద్రం తన రుణ భారాన్ని 2024 మార్చి 31కల్లా జి.డి.పిలో 40 శాతం మించకుండా ఉండేట్లు, 2021 మార్చి 31కల్లా తన ద్రవ్య లోటును జి.డి.పిలో 3 శాతానికి పరిమితం చేసుకునేట్లు వీలుగా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ సవరణలు కేంద్రానికి అధికారమిచ్చాయి. స్వల్ప కాలంలో ఈ లక్ష్యాల సాధన కుదరకపోవచ్చు. ఆ వ్యత్యాసాలకు
కారణాలను కోవిడ్ ప్రేరేపిత ఆర్థిక మందగమనం పాక్షికంగానే వివరిస్తుంది. ద్రవ్య లోటు, రాబడి లోటు లక్ష్యాలకు రాష్ట్రాలు సగటు స్థాయిలో కట్టుబడి ఉన్నప్పటికీ, వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర తారతమ్యాలున్నాయి. దీనికితోడు, కోవిడ్, కేంద్రం అనుమతించిన అదనపు రుణ పరిమితుల
ప్రభావంతో, రాష్ట్రాల ద్రవ్య స్థితి కొంత క్షీణతను కనబరచింది. బడ్జెటేతర రుణాలను తన పద్దుల పుస్తకాలలోకి తెస్తూ, ఒక రాష్ట్రం బడ్జెటేతర రుణం తీసుకుని, దానిపై వడ్డీలను ఆ రాష్ట్ర బడ్జెట్ వనరుల నుంచి చెల్లిస్తే దాన్ని రాష్ట్ర రుణంగా వ్యవహరించేందుకు కేంద్రం ఇటీవల చేపట్టిన చర్యలు సరైన దిశలో తీసుకున్నవే. ద్రవ్య పటిష్టత యంత్రాంగాన్ని మరింత కట్టుదిట్టం చేయవలసి ఉంది. రుణ స్థాయిలు, ద్రవ్య, రాబడి లోటులను తగ్గించుకొనే మార్గాలను సూచించడంలో ఫినాన్స్ కమిషన్లు అద్భతమైన పాత్ర పోషిస్తున్నాయి. రాబడి లోటుతో బాధపడుతున్న రాష్ట్రాలకు రుణ రాయితీలకు FC-XII సిఫార్సు చేసింది. అయితే, ద్రవ్య బాధ్యతకు సంబంధించి చట్టాలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే వాటిని వర్తింపజేయాలని షరతు పెట్టింది. ద్రవ్య పటిష్టతను కట్టుదిట్టం చేసే ప్రధాన బాధ్యత FC-XVI పై ఉంది. పొందికైన ద్రవ్య వివేచనతో వ్యవహరించేవాటికి ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాన్ని అన్వేషించే, ఆ బాధ్యతల నుంచి తప్పించుకోకుండా నిరోధించే నిబంధనలను రూపొందించే బాధ్యత కూాడా FC-XVI దే.

5. సమానత-సమర్థతల సమతూకం
సమానత-సమర్థతల మధ్య సమతౌల్యం తీసుకురావడం ఏ ఫినాన్స్ కమిషన్ కైనా ప్రధాన సమస్యే. ఫినాన్స్ కమిషన్ బదలాయింపులు రాను రాను ప్రగతిశీలంగా మారుతున్నప్పటికీ, వివిధ రాష్ట్రాల మధ్య రాబడులలో వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. ఈి సందర్భంలోనే, ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలిక అంశం ముందుకొస్తోంది. పన్నుల రాబడి బదలాయింపులలో దక్షిణాది రాష్ట్రాల వాటా రెంవడ ఫినాన్స్ కమిషన్ కాలం (1957-62)లో ఉన్న 23.3 శాతం నుంచి తొమ్మిదవ కమిషన్ (1990-95) నాటికి 22.1 శాతానికి తగ్గింది. ఇది FC-XV (2021-26) కాలం నాటికి మరింత క్షీణించి 15.8 శాతానికి తగ్గింది.
సంపన్న రాష్ట్రాల నుంచి పేద రాష్ట్రాలకు వనరుల పునః పంపిణీ అన్ని సమాఖ్యలలోనూ సాధారణమే అయినా, సంపన్న రాష్ట్రాలను నీరుగార్చకుండా, ఏ మేరకు అటు వంటి అధిక పునః పంపిణీ వాంఛనీయమైనదన్నదే ప్రశ్న.

వెనుకబడిన రాష్ట్రాలలోకన్నా తమ రాష్ట్రాల్లో తలసరి ఆదాయాలు అధికంగా ఉండడం వల్ల ఫినాన్స్ కమిషన్లు వాటి సిఫార్సుల్లో తమపట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాయనే భావన చక్కని పనితీరు కలిగిన రాష్ట్రాల్లో ఉంది. చక్కని పనితీరు ప్రదర్శిస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలి. అదే సమయంలో, వెనుకబడిన రాష్ట్రాలకున్న ప్రతిబంధకాలను ఉపేక్షించకూడదు. బదలాయింపులు ఎక్కువగానే ఉన్నాయి భరోసాతో,

వెనుకబడిన రాష్ట్రాలు ఉపేక్షకు స్థానమివ్వకూడదు. నియోజకవర్గాల పునర్విభజన 2026లో చోటుచేసుకోనుంది. ఇది దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ సీట్లు తగ్గడానికి దారితీయవచ్చు. జనాభా వృద్ధి ఓ మోస్తరుగానున్న, చక్కని పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ఇది ముందు నుయ్యి వెనుక గొయ్యి
లాంటి పరిస్థితి.

అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో కూడా తిరిగి కొన్ని ప్రాంతాల మధ్య తీవ్ర తేడాపాడాలున్నాయి. వెనుకబడిన ప్రాంతాలున్నాయి. వీటిపై దృష్టి సారించవలసి ఉంది. పన్నుల రాబడి బదలాయింపులలో గీటురాయిగా ఎటువంటి మార్పు తీసుకురాదలచుకున్నా, అది క్రమంగా చోటుచేసునేట్లు, చక్కని పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ఉన్న నిధుల ప్రవాహానికి పెద్ద గండి కొట్టకుండా ఉండేట్లు చూసుకోవడం అభిలషణీయం. కనుక, ఆదాయం, కార్పొరేట్ పన్నులపై 5 శాతం సర్ చార్జీని ప్రత్యేక లెవీగా విధించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని , ఆ ఆదాయం ఏ రాష్ట్రాల నుంచి వచ్చిందో వాటికి మాత్రమే కేటాయించే ప్రతిపాదనను FC-XV పరిశీలించవచ్చు. (రాజ్యాంగం ప్రకారం, ఆదాయ పన్ను కేంద్ర జాబితాలో ఉంది.
తమ పరిధుల్లో ఉత్పన్నమవుతున్న ఆదాయాలపై రాష్ట్రాలు సర్ చార్జీని విధించలేవు). అటువంటి సర్ చార్జీ విధించడం ఆరోగ్యకరమైన పోటీదాయక సమాఖ్యవిధానానికి దారితీస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడి, పన్ను విధించదగిన ఆదాయ విస్తృతి మెరుగుపడుతుంది. పనితీరు కనబరచే రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాల మధ్య ప్రయోజనాలలో సమతౌల్యం సాధించడం ఏ ఫినాన్స్ కమిషన్ కైనా పెద్ద సవాల్.

6. వెనుకబడిన రాష్ట్రాల అల్ప శోషక సామర్థ్య సమస్యను పరిష్కరించడం
వెనుకబడిన రాష్ట్రాలకు బదలాయింపులలో ఈక్విటీపై దృష్టి కేంద్రీకరిస్తూ, ఆయా రాష్ట్రాలకు ఇముడ్చుకునే సామర్థ్యం కొరవడడం పై ఇంతవరకు ఏమంత దృష్టిని సారించలేదు. వాటి శోషక సామర్థ్యం తక్కువగా ఉండడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. ఫినాన్స్ కమిషన్లు, ప్రణాళికా
సంఘాలు ( ప్రణాళికా సంఘాన్ని 2015 మార్చిలో నీతి ఆయోగ్ గా మార్చారు) నిధుల బదలాయింపులలో చాలా ప్రగతిశీలంగా వ్యవహరిస్తున్నప్పటికీ, వివిధ రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలు విస్తరిస్తూ వస్తున్నాయి. వెనుకబడిన రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న వనరులను సరైన
రీతిలో వినియోగించుకునే సామర్థ్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. బిహార్, చత్తీస్ గఢ్, జార్ఘండ్ వంటి అనేక వెనుకబడిన రాష్ట్రాలు రాబడి ఖాతాలలో మిగుళ్ళను చూపగలుగు తున్నాయి. వాటి ద్రవ్య లోటులు కూడా అనుమతించిన స్థాయిలకన్నా దిగువనే ఉంటున్నట్లు తేలుతోంది. చాలా భాగం వెనుకబడిన రాష్ట్రాలు వాటికి కేంద్రం కేటాయించిన మార్కెట్ రుణాలను పూర్తిగా వినియోగించుకోవడం లేదని ఇది సూచిస్తోంది.

ఈ ప్రతిబంధకాలను దృష్టిలో పెట్టుకుని చూసినపుడు, వాటిని చేయి పట్టుకుని నడిపించే పాత్రను, ఇముడ్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచే బాధ్యతను నీతి ఆయోగ్ కు అప్పగించవలసిన అవసరం కనిపిస్తోంది. దీని నిమిత్తం కేంద్రం ఒక ప్రత్యేక నిధిని సృష్టించి, దాని నిర్వహణ ను నీతి ఆయోగ్ కు అప్పగించవచ్చు. నీతి ఆయోగ్ తాను సముచితమని భావించిన ప్రాజెక్టులకు దాన్నుంచి నిధులు  ఇస్తుంది. ఇప్పటివరకు కేవలం మేధావుల బృందంగా ఉన్న నీతి ఆయోగ్ కు దీనితో కొన్ని అధికారాలను కూడా సమకూర్చినట్లు అవుతుంది.

7. ప్రధాన ఖనిజాలపై రాయల్టీలు మరియు ఖనిజ నిక్షేపాలను కేంద్రం వేలం వేయడం
ఏ ప్రధాన ఖనిజానికైనా సరే రాయల్టీని చెల్లించే రేటును పెంచే లేదా తగ్గించే అధికారం 1957 నాటి గనులు, ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం (ఎం.ఎం.డి.ఆర్) కింద కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే, మూడేళ్ళ కాల పరిధిలో అది అలా ఒక్కసారి మాత్రమే రేటును నిర్ణయించగలిగి ఉంటుంది. రాయల్టీ రేట్లను చివరిసారిగా 2014 సెప్టెంబర్ లో సవరించారు. రాష్ట్రాలే ఈ రాయల్టీలను వసూలు చేసి
అట్టేపెట్టుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థకు విలువ చేకూర్చడానికి, విద్యుదుత్పాదన రంగానికి బొగ్గు కొరత సమస్యను పరిష్కరించేందుకు, బొగ్గు రంగాన్ని సంస్కరించే కారణంతో ఎం.ఎం.డి.ఆర్. చట్టానికి 2015లో సవరణలు చేయడం ద్వారా గనులను వేలం వేసే పనిని కేంద్రం ప్రారంభించింది. ఖనిజాల హక్కులపై పన్నులు వేసే అంశం రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో 50వ అంశం కింద చేరింది. అయితే, ఇది
గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధికి సంబంధించి కేంద్రం చేసే చట్టానికి లోబడి ఉంటుంది. ప్రజా ప్రయోజనం రీత్యా అవసరమని భావించి పార్లమెంట్ చేసే ఏ చట్టం పరిశీలన కిందకైనా అది వస్తుంది. ఇంతవరకు 330 ఖనిజాల నిక్షేపాలను వేలం వేసినట్లు కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. వాటిలో చాలా భాగం ఇంకా పనులను ప్రారంభించవలసి ఉందని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రాలకు లభిస్తున్న రాయల్టీ మొత్తం 2017-18 నుంచి 2021-22 మధ్య మూడింతలకు పైగా పెరిగిందని, కనుక, ప్రధాన ఖనిజాలపై రాయల్టీ రేట్లను సవరించే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన అన్నారు. ఖనిజ నిక్షేపాలున్న రాష్ట్రాలు చాలా వరకు వెనుకబడినవే. రాయల్టీ రేట్లను 2014 నుంచి సవరించకపోవడం వల్ల , వాటి పెద్ద ఆదాయ వనరును కాలదన్నినట్లు అవుతోంది. ప్రధాన ఖనిజాలపై మొత్తం రాయల్టీ 2021-22లో రూ. 38,840.54 కోట్ల మేరకు ఉంది. దీనిలో మూడు రాష్ట్రాల (చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా) వాటా 76.2 శాతంగా ఉంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా , వెనుకబడిన రాష్ట్రాల రాబడి కి ఎందుకు కోత పెట్టాలన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. 2014 నుంచి సూచీకరణతో రాయల్టీ రేట్లను వెంటనే సవరించాలని సిఫార్సు చేసే అంశాన్ని FC- XVI పరిశీలించవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2023 ఎం.ఎం.డి.ఆర్. సవరణ చట్టం ద్వారా 1957 నాటి ఎం.ఎం.డి.ఆర్. చట్టాన్ని సవరించింది. దీనితో 1957 ఎం.ఎం.డి.ఆర్ చట్టం షెడ్యూలు-1లో ని 'డి' విభాగంలో 24 కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలు చేరాయి. ఈ సందర్భంలో ఇది గమనించవలసిన మరో విషయం. అంతేకాదు, సవరణ పొందిన చట్టం ఈ ఖనిజాల నిక్షేపాలను వేలం వేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతోంది. ఈ ఖనిజాలలో మొదటి భాగం వేలంపాటను భారత ప్రభుత్వం 2023 నవంబర్ 29న ప్రారంభించింది. కీలక, వ్యూహాత్మక ఖనిజాల 20 నిక్షేపాలను వేలం వేసింది.

8. స్థానిక సంస్థలకు గ్రాంట్లు
ఒక రాష్ట్రానికి చెందిన సంచిత నిధిని పెంపొందించేం దుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేయడం రాజ్యాంగం ప్రకారం ఫినాన్స్ కమిషన్ కున్న విధులలో ఒకటి. రాష్ట్రానికి చెందిన ఫినాన్స్ కమిషన్ సిఫార్సులను ప్రాతిపదికగా చేసుకుని పంచాయతీలు, పురపాలక సంస్థలకు అదనపు నిధులు
సమకూర్చేందుకు ఆ నిధి ఉపయోగపడుతుంది. నిర్ణీత కాలాలకు రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ లను ఏర్పాటు చేయడం పట్ల చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిజానికి, కేంద్ర ఫినాన్స్ కమిషన్లతోపాటే అవి కూడా పని ప్రారంభించి ముగించేట్లు చేయవలసి ఉంటుంది. కేంద్ర ఫినాన్స్ కమిషన్లు వరుసగా సలహాలిస్తూ వస్తున్నప్పటికీ ఈ విషయంలో రాష్ట్రాలు బెల్లంకొట్టిన రాయిలా వ్యవహరిస్తున్నాయి. ఫినాన్స్ కమిషన్లను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలు విఫలమైతే, స్థానిక సంస్థలకు కేంద్ర ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాంట్లను నిలిపివేయవలసిందని FC-XV సిఫార్సు చేసింది. రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ల సిఫార్సులపై తీసుకున్న చర్యల నివేదికలను 2024 మార్చి 31కల్లా ఆయా రాష్ట్రాల చట్ట సభల ముందు ఉంచాలని కూడా రాష్ట్రాలను కేంద్ర ఫినాన్స్ కమిషన్ ఆదేశించింది. రాష్ట్రాలు దారికొచ్చేట్లు చేయవలసిన అవసరం ఉంది.

వికేంద్రీకరణ ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే, బదలాయింపులు, సొంత రాబడి ఉత్పాదన రెండింటి ద్వారా వాటి రాబడులను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. బదలాయింపులను సులభతరం చేయడంలో FC-XII అనుసరించే విధానానికి ఇక్కడ ప్రాధాన్యం ఉండవచ్చు. భాగింపదగిన పన్నుల రాబడి తటాకం నుంచి (రాష్ట్రాల వాటా కాకుండా, దానిని మించి) కొంత శాతం మొత్తాన్ని స్థానిక సంస్థలకు బదలాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. 275వ అధికరణం కింద ఈ వాటాని అది గ్రాంట్- ఇన్-ఎయిడ్ గా మార్చింది. స్థానిక సంస్థలకు ఒక నిర్దిష్ట సంవత్సరపు (t) గ్రాంట్ అర్హతను నిర్ణయించడంలో ముందరి సంవత్సరపు (t-1) భాగింపదగిన రాబడి తటాకపు పరిమాణాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని అది సిఫార్సు చేసింది.

9. స్థానిక సంస్థల స్వీయ వనరుల సమీకరణ
ప్రస్తుతం 276 అధికరణం కింద స్థానిక సంస్థలు వృత్తి పన్ను విధించంలో రూ. 2,500 మేరకు ఉన్న పరిమితిని సవరించవలసిందని సిఫార్సు చేసే అంశాన్ని FC-XVI పరిశీలించవచ్చు. స్థానిక సంస్థలకు మరింత వెసులుబాటు కల్పించడానికి ఏకమొత్తంగా ఆ పరిమితి నిబంధనను తొలగించాలని కూడా సిఫార్సు చేయవచ్చు. స్థానిక సంస్థలు అదనపు వనరులను సమీకరించుకోగల మార్గాలను గుర్తించవలసిందని రాష్ట్రాల ఫినాన్స్ కమిషన్లకు సలహా ఇచ్చే సంగతిని కూడా కమిషన్ పరిశీలించవచ్చు. ఉదాహరణకు, సర్వీసులను పూర్తిగా లేదా పాక్షికంగా లేదా అసలు ఏమీ వినియోగించుకోకుండా ఉన్నందుకు కేంద్ర ప్రభుత్వం, దాని శాఖలు ఆస్తి పన్ను ఏమీ చెల్లించనవసరం లేదుకానీ, 75 శాతం, 50 శాతం లేదా 33.33 శాతం రేటు చొప్పున లెక్కగట్టిన సర్వీసు చార్జీలను చెల్లించవలసి ఉంటుందని రాజ్కోట్ మునిసిపల్ కార్పొరేషన్ దాఖలు చేసిన సివల్ అప్పీలు (నం. 9458-63/2003)లో సుప్రీం కోర్టు ఆదేశించింది. దీని నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ సంబంధిత శాఖ అధిపతి సంబంధిత
స్థానిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. అనేక స్థానిక సంస్థలు దీనిని అనుసరించడం లేదు.

10. షరతులు Vs బేషరతు గ్రాంట్లు

గ్రాంట్లు ప్రధానంగా ముడిపడినవై ఉండాలా లేక ముడిపడనక్కరలేదా అనేది కూడా FC-XVI పరిశీలించదగిన అంశాల్లో మరోటి అవుతుంది. గ్రాంట్లు పనితీరుతో ముడిపడినవై ఉండాలని ఫినాన్స్ కమిషన్లు కొంతకాలంగా సిఫార్సు చేస్తూ వస్తున్నాయి. షరతులతో కూడిన గ్రాంట్ల విడుదల చాలా
పేలవంగా ఉందని అనుభవం సూచిస్తోంది. ఫినాన్స్ కమిషన్లు నిర్దేశఇంచినవాటికి తోడు కేంద్ర మంత్రిత్వ శాఖలు విధించే కఠిన షరతులు అందుకు కారణం. ఉదాహరణకు, పారిశుధ్య గ్రాంట్లను వినియోగించుకునేం దుకు FC-XV ఏం చెప్పిందో చూద్దాం. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అర్బన్
అథారిటీ కలసి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో త్రైపాక్షిక అవగాహనా పత్రం (ఎంఓయూ) పై సంతకాలు చేయాలి. దానిలో నీటి సరఫరా , నీటి సంరక్లణ , ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ లక్ష్యాలు సాధనకు పెట్టుకున్న వార్షిక లక్ష్యాలు, ప్రాథమిక స్థాయిలను వివరించాలి. స్వచ్ఛ
భారత్ మిషన్ ఫలితా లను నిలబెట్టేందుకు చేస్తున్న పనులు వివరించాలి. చాలా భాగం కేసుల్లో, ఈ అనేక షరతుల్లో ఏ ఒక్క దానిలో విఫలమైనా మొత్తం గ్రాంటును నిరాకరిస్తున్నారు. కనుక, షరతులతో కూడిన గ్రాంట్ల అంశాన్ని FC-XVI పరిశీలించాలి. అమలు చేసేందుకు సులభంగా ఉన్నవాటినే విధించాలి. తగినంత సరళతతో పర్యవేక్షిస్తూ స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా అవి ఆ గ్రాంట్లను వినియోగించుకునేట్లు చేయాలి.

11. రాష్ట్రాలకు పెరుగుతున్న ఖర్చుల అనివార్యతలుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో బహుముఖ ఏజన్సీలతో కేంద్రం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. రాష్ట్రాల తరఫు వ్యయాలు ఈ ఒప్పందాల్లో ఉంటున్నాయి. ఫినాన్స్ కమిషన్ మదింపులోనే ఈ వాగ్దానాలను చొప్పించేట్లు చూడాలి.

12. కేంద్ర పి.ఎస్.యు. భూముల ద్రవ్యీకరణ

. ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు పైసా పుచ్చుకోకుండా లేదా నామమాత్రపు ధరకు జాగాలు ఇచ్చాయి. వాటిలో చాలా భాగం ఇపుడు మూతపడ్డాయి. వాటి యాజమాన్యం కిందనున్న భూములను కేంద్రం అమ్మేసి సొమ్ము చేసుకుని, ఆ నగదును రాష్ట్రాలతో
పంచుకోవడం లేదు. ఆ భూములు నిర్దిష్ట ప్రయోజనం కోసం ఇచ్చినవి కనుక అలా చేయడం పూర్తిగా అసమంజసం. భూములు అమ్మగా వచ్చిన సొమ్మును రాష్ట్రాలతో పంచుకునేట్లు చేసే అంశాన్ని కూడా FC-XVI పరిశీలించవచ్చు.

13. రెవిన్యూ సంస్కరణలు
జి.డి.పితో పోలిస్తే రాష్ట్రాల స్వీయ పన్నుల రెవిన్యూ నిష్పత్తి 6 నుంచి 7 శాతం వద్ద నిలిచిపోయి ఉంటోంది. జి.ఎస్.డి.పితో చూస్తే పన్నులయేతర రెవిన్యూ నిష్పత్తి 1 శాతం మించి ఉండడం లేదు. రాష్ట్రాల స్వీయ పన్నుల రెవిన్యూ గత దశాబ్దాంతంలో ఉన్న 0.72 నుంచి సగం పైగా తగ్గి కడచిన మూడేళ్ళలో 0.32గా ఉందని అత్యంత తాజా అంచనాలు సూచిస్తు న్నాయి (ఎకనామిక్ &పొలిటికల్ వీక్లీ సంపాదకీయం, 'ద
సిక్ట్సీంత్ ఫినాన్స్ కమిషన్' , 2023 డిసెంబర్ 23) కేంద్ర పన్నుల-జి.డి.పి నిష్పత్తి 2021-22లో 11.7 శాతానికి మెరుగుపడినప్పటికీ, అది 2007-08లో సాధించిన 11.89 శాతంకన్నా ఇప్పటికీ స్వల్పంగా తక్కువగానే ఉంది. రాష్ట్రాలు పన్నుల రాబడులను పెంచుకునేందుకు అవకాశం ఉన్నా, వాటికి దండిగా ఆదాయం తెచ్చిపెట్టే 'వ్యాట్ 'వంటి అనేక పన్నులు జి.ఎస్.టిలో మిళితం కావడం వల్ల , ఆ అవకాశం
పరిమితమైపోయింది. కనుక, జి.డి.పి.-పన్నుల నిష్పత్తిని మెరుగుపరచవలసిన ప్రధాన బాధ్యత కేంద్రంపైనే ఉంది. కేంద్ర రెవిన్యూ సాధారణ అంచనాలలో పన్నుల పునాది విస్తరణ, వనరుల సమీకరణకు ఉన్న అవకాశాలను పొందుపరచవలసి ఉంది. రాష్ట్రాలు తమ మొత్తం మూలధన వ్యయానికి, తమ రెవిన్యూ ఖర్చులో 42 శాతం భాగానికి నిధులకు కేంద్రం పైనే ఆధారపడుతున్నందు వల్ల ఇది చాలా ముఖ్యం.

14. వ్యయాల సంస్కరణలు-హేతుబద్ధీకరణ
కేంద్ర, రాష్ట్ర స్థాయిలు రెండింటిలోను ఖర్చుల హేతుబద్ధీకరణకు ఎంతైనా అవకాశం ఉంది. కొనసాగుతున్న పథకాలపై అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు రెండూ సమీక్షించడం కొరవడుతోంది. అనేక ఏళ్ళ క్రితం చేపట్టిన పథకాలను ఎటువంటి సమీక్ష లేకుండా అలాగే కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు సూచింటినట్లుగా, సి.ఎస్.ఎస్.లను ఐదేళ్ళ కొకసారి సమీక్షిస్తామని ఇచ్చిన మాటలపై కేంద్రం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఫినాన్స్ కమిషన్ల అవార్డు కాలపరిధితో అవి ముగిసేట్లు చేస్తామని చెప్పిన మాటనూ కేంద్రం విస్మరిస్తోంది. రాష్ట్రాలకు చెందిన ప్రస్తుతం కొనసాగుతున్న అనేక పథకాలకు కూడా అలాగే తుది గడువులు లేవు. ఫలితంగా, అవి పూర్తిగా కాలం చెల్లినవిగా పరిణమించినా బడ్జెట్ కేటాయింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే 800లకు పైగా పథకాలున్నాయి. వాటిలో కొన్ని 40 ఏళ్ళకు పైనే శ్రీకారం చుట్టినవి.

అటువంటి విధానాల వల్ల అరకొరగా ఉన్న వనరులు మరింత చెల్లాచెదురై ఫలితాలను నీరుగారుస్తున్నాయి.

అలాగే,కేంద్ర, రాష్ట్ర స్థాయిలు రెండింటిలోనూ కార్యాలయాలుంటున్నాయి. అవి నేడు పూర్తిగా ప్రాధాన్యం కోల్పోయినవి. ఉదాహరణకు, అనేక రాష్ట్రాల్లో బ్రిటిష్ పాలనకు వారసత్వమైన స్టేట్ గెజిటీర్ కార్యాలయాలున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రతి శాఖలోను అటువంటి కార్యాలయాలను
కనుగొనవచ్చు. ప్రత్యామ్నాయంగా, కొన్ని కార్యాలయాలను విలీనం చేయవచ్చు. వనరులను మరీ తక్కువగా కేటాయించడం మరో ప్రధాన సమస్య. మూలధన పనులు ఫలితమిచ్చే కాలాన్ని కుదించడం కోసం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ శాఖ అయినా సరే, అనుబంధ పనులతో సహా మంజూరైన పనుల మొత్తం విలువ ఆ ఏడాదికి సంబంధించి ఆ నిర్దిష్ట శాఖ పద్దు బడ్జెట్ అంచనాలకు మూడు రెట్లు మించి

ఉండకూడదని చాలా రాష్ట్రాల ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టాలు నిర్దేశిస్తున్నాయి. దానికితోడు, ఆ ఏడాదిలో అమలుచేయనున్న అనుబంధ పనులతో సహా పనుల మొత్తం వ్యయం సంబంధిత శాఖ ఆ ఏడాదికి పేర్కొన్న బడ్జెట్ అంచనాల్లో ఒకటిన్నర రెట్లకు మించి ఉండకూడదని నిబంధన ఉంది. అయినా, ఏ దండనా లేకుండా ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఫలితంగా, ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు నిధుల కొరతతో అలమటిస్తూంటే, అనేక కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నారు. పర్యవసానంగా వ్యయం పెరుగుతోంది. కాలహరణం అవుతోంది. పభుత్వ వ్యయం నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టేం దుకు ఈ అంశాలపైకి కూడా FC-XVI దృష్టి సారించవచ్చు. కేంద్రం, రాష్ట్రాలు రెండూ FC-XIV సిఫార్సు చేసినట్లుగా సంచిత ఆధారిత బడ్జెటింగ్ కు దశల వారీగా పరిణామం చెందాలని పునరుద్ఘాటించవలసిన అవసరం ఉంది.

15. ఫినాన్స్ కమిషన్ల సిఫార్సులను అవార్డుగా, ప్యాకేజీగా పరిగణించాలి
. రాష్ట్రాలకు ద్రవ్య బదలీలకు సంబంధించిన సిఫార్సులను అవార్డుగా పరిగణించడం రివాజు. ఈ వ్యవస్థిత సంప్రదాయాన్ని పక్కనపెట్టి కేంద్రం, నిర్దిష్ట రంగానికి, నిర్దిష్ట రాష్ట్రానికి గ్రాంట్లకు సంబంధించి FC-XV చేసిన సిఫార్సులను అంగీకరించలేదు. ఇది పూర్తిగా అసాధారణం. రాజ్యాంగం ప్రకారం నియమించిన కమిషన్ ను బలహీనపరచడమే అవుతుంది. తమ సిఫార్సులు ప్యాకేజీ, అవార్డు స్వరూప స్వభావాలు కలిగినవని
స్పష్టం చేసే అంశాన్ని FC-XVI పరిశీలించవచ్చు. ఇంతకుముందు సూచించినట్లుగా, ఇంతకుముందరి కమిషన్ల సిఫార్సులను, ముఖ్యంగా రాష్ట్రాలకు పన్నుల రాబడిలో వాటా ఇవ్వడానికి చెందినవాటిపై సమీక్షించడం అభిలషణీయం కాకపోవచ్చు. రాష్ట్రాలకు అధిక వాటా ఇవ్వాలని కోరడమంటే, సమైక్య బదలాయింపులకు అనుకూలంగా బదలాయింపుల రూపురేఖలను మార్చడమేనని అర్థం చేసుకోవాలి. అనేక అదనపు అంశాలు, పరిశీలనల గుదిబండలు లేకపోయినా, FC-XVI నిర్వర్తించవలసిన కర్తవ్యాలు ఒక సవాల్ విసురుతున్నాయనడంలో సందేహం లేదు.

(2024, జనవరి 29)
(అభిప్రాయాలు వెల్లడించిన డాక్టర్ వై.వి. రెడ్డి, డాక్టర్ మహేంద్ర దేవ్, డాక్టర్ రామ్ మనోహర్ రెడ్డిలకు నేను
కృతజ్ఞతలు తెలుపదలచుకున్నాను.)